Outsourcing Jobs Scam | రాష్ట్రంలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఏజెన్సీలకు సంబంధించి అధికారిక ప్రొసీడింగ్స్ వెలువడక ముందే, తెరవెనుక దందా మొదలైనట్లు తెలుస్తోంది.మరీ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ లోని హన్మకొండ, వరంగల్, మహబూబాద్,ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వీరి దందా జోరుగా సాగించేందుకు ఇప్పటికే కసరత్తు చేసినట్లు ఓ ఏజెన్సీ నిర్వాహకుడు “సర్కార్ లైవ్” ప్రతినిధితో అన్నారు.
పది రోజుల్లో ప్రొసీడింగ్స్.. వెనువెంటనే నియామకాలు
రాష్ట్రంలోని పలు కీలక శాఖల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. మరో పది రోజుల్లో ఎంపిక చేసిన ఏజెన్సీలకు ప్రొసీడింగ్స్ (Orders) అందనున్నాయి. ఈ ఆదేశాలు అందిన వెంటనే నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఏజెన్సీలు భావిస్తున్నాయి. అయితే, ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. పోస్టును బట్టి వసూళ్లు ఉంటాయని సమాచారం
| పోస్టు పేరు | వసూలు అంచనా మొత్తం |
| అటెండర్ / స్వీపర్ | రూ. 1.5 లక్షల నుండి 2 లక్షలు |
| డేటా ఎంట్రీ ఆపరేటర్ | రూ. 3 లక్షల నుండి 4 లక్షలు |
| జూనియర్ అసిస్టెంట్ | రూ. 4 లక్షల నుండి 5 లక్షలు |
| GNM / ANM (వైద్య శాఖ) | రూ. 5 లక్షలకు పైగా |
| సూపర్వైజర్ స్థాయి పోస్టులు | రూ. 7 లక్షల నుండి 10 లక్షలు |
రేట్లు ఫిక్స్.. పైరవీల పర్వం
నిరుద్యోగ గండం గట్టెక్కాలంటే లక్షల్లో సమర్పించుకోవాల్సిందేనంటూ కొన్ని ఏజెన్సీల ప్రతినిధులు అప్పుడే నిరుద్యోగులతో బేరసారాలు మొదలుపెట్టారు.తాము ఎక్కడా కనపడకుండా,కొంతమంది నమ్మకస్తులైన వ్యక్తులను ముందుపెట్టి వసూళ్లు చేసేందుకు ఏజెన్సీ నిర్వాకులు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్,జూనియర్ అసిస్టెంట్, జి ఎన్ ఎమ్, ఏ ఎన్ ఎమ్ పోస్టుల నుంచి మొదలుకొని సూపర్వైజర్ స్థాయి పోస్టుల వరకు ఒక్కో పోస్టుకు ఒక్కో రేటును ఫిక్స్ చేసినట్లు సమాచారం.
”ముందుగా కొంత.. నియామక పత్రం అందిన తర్వాత మరికొంత” అనే పద్ధతిలో వసూళ్లు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా, కనీసం నెలకు వచ్చే అరకొర జీతంతో బతకవచ్చనే నిరుద్యోగుల ఆశను ఏజెన్సీలు పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి!
ఏజెన్సీల పేరుతో బ్రోకర్ ల మాయమాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం పైరవీల ద్వారానే ఉద్యోగాలు వస్తాయనే భ్రమను సృష్టించి కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా ఈ ముఠాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ నియామక ప్రక్రియపై నిఘా పెట్టాలని, పారదర్శకమైన పద్ధతిలో నియామకాలు జరిగేలా చూడాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏజెన్సీలకు ప్రొసీడింగ్స్ అందిన వెంటనే ఏ ఏజెన్సీ లో ఎన్ని ఖాళీలు ఏ ఏ శాఖలో ఉన్నాయి. ఏ ఏజెన్సీ పోస్టుల వారీగా ఎంత డిమాండ్ చేస్తుందో బహిర్గతంగా తెలియజేసేందుకు “సర్కార్ లైవ్”సిద్ధం… నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ‘సర్కార్ లైవ్’ కోరుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








