పౌరసరఫరాల రికార్డులకు మిల్లులోని ధాన్యం నిల్వలకు భారీ తేడా?
Sai Krishna Rice Mill Grain Scam | పౌరసరఫరాల శాఖ రికార్డుల్లో వందల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉన్నట్లు చూపిస్తున్నా, మిల్లులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా నందనంలోని సాయి కృష్ణ రైస్ మిల్లుపై ఇప్పుడు అనేక ఆరోపణలు ముసురుకుంటున్నాయి. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రికార్డుల్లో ‘నిల్వ’… మిల్లులో ‘ఖాళీ’!
పౌరసరఫరాల శాఖ రికార్డుల ప్రకారం మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 15 ఏసికేలు (ACKs) ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ధాన్యం నిల్వలు మిల్లుకు రాకుండానే రికార్డులు సృష్టించారా? లేదా మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని అక్రమ మార్గాల్లో బయట మార్కెట్లోకి తరలించారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ట్రక్ షీట్ల మాయాజాలం?
ధాన్యం రాకపోయినా వచ్చినట్లుగా కృత్రిమంగా ట్రక్ షీట్లు (Truck Sheets) సదరు మిల్లు యాజమాన్యం సృష్టించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల కళ్లుగప్పి ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు స్థానికులు మరియు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 15 ఏసికేలు పెండింగ్‌లో ఉండటం ,మిల్లులో ధాన్యం నిల్వలు లేకపోవడం చూస్తుంటే ట్రక్ షీట్ల మాయాజాలం జరిగినట్లు ఆరోపణలు బలపడుతున్నాయి.
Rice Mill Grain Scam : విచారణకు డిమాండ్..
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనంలోని ఈ మిల్లుపై వస్తున్న ఆరోపణలపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఫిజికల్ వెరిఫికేషన్ (Physical Verification) నిర్వహిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వేల క్వింటాళ్ల ధాన్యం లెక్క తేలాల్సి ఉండటంతో జిల్లా యంత్రాంగం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








