- కోల్డ్ స్టోరేజ్ యజమానుల చీటింగ్
- నకిలీ రైతుల పేర్లతో ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్లు..
- కోల్డ్ స్టోరేజ్ లలో స్టాక్ పెట్టినట్లు రికార్డులు సృష్టించి( నకిలీ రైతులను) బ్యాంకులను మోసం చేస్తున్న వైనం
- వరంగల్ జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాల భాగోతం
Cold Storage Scam in warangal | అన్నదాతలకు అండగా ఉండాల్సిన కోల్డ్ స్టోరేజ్ (శీతల గిడ్డంగి) కేంద్రాలు కొందరు యజమానుల స్వార్థంతో అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి.నకిలీ రైతులను సృష్టించి( పేర్లను వాడుకుంటూ), ప్రైవేట్ బ్యాంకు అధికారులతో చేతులు కలిపి కోట్లాది రూపాయల మేర బ్యాంకు రుణాలను కొల్లగొడుతున్న వైనం వరంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది.
అక్రమ నెట్‌వర్క్.. అసలు కథ ఇదే!
సాధారణంగా రైతులు పండించిన పంటను కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరిచినప్పుడు, ఆ నిల్వలపై బ్యాంకులు ‘అగ్రికల్చర్ లోన్’ (పంట తాకట్టు రుణం) మంజూరు చేస్తాయి. దీన్నే ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు భారీ స్కామ్‌కు తెరలేపారు.
నకిలీ రికార్డుల సృష్టి: కోల్డ్ స్టోరేజీలో అసలు వారు పంటను నిల్వచేయకపోయిన, అసలు వారు రైతులే కాకపోయినా, స్టాక్ పెట్టినట్లుగా, నకిలీ రసీదులు (Warehouse Receipts) సృష్టిస్తున్నారు.
బినామీ రైతులు: పంట పండించని వ్యక్తులను, చివరికి సంబంధం లేని వ్యక్తులను, కోల్డ్ స్టోరేజ్ లల్లో పనిచేసే గుమస్తాలను, వారి కుటుంబ సభ్యులను కూడా ‘రైతులు’గా చూపిస్తూ వారి పేర్లతో లోన్లు కొల్లగొడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బ్యాంకు మేనేజర్ల అండ: కొన్ని ప్రైవేట్ బ్యాంకుల మేనేజర్లను, సిబ్బందిని మచ్చిక చేసుకుని (కమిషన్ల ఆశ చూపి) క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే రుణాలు మంజూరు చేయించుకుంటూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట్లు తెలిసింది.
వెలుగులోకి వస్తున్న భాగోతం
గత కొంతకాలంగా జిల్లాలో ఈ స్కామ్ గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా ఈ అక్రమ వైనాలు బయటపడుతున్నాయి. భారీ ఎత్తున నకిలీ రైతులను(రైతులు కానివారిని) సృష్టించి కోల్డ్ స్టోరేజ్ యజమానులు ప్రైవేట్ బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నట్లు తెలిసింది.”రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న రుణ సదుపాయాన్ని కొందరు కోల్డ్ స్టోరేజ్ యజమానులు అక్రమంగా వాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రధాన అంశాలు:
తనిఖీల లోపం: స్టోరేజీల్లో స్టాక్ ఎంతుందో సరిచూడాల్సిన ఫీల్డ్ ఆఫీసర్ లు కూడా యజమానులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రుణాల మళ్లింపు: రైతుల పేరిట వచ్చిన కోట్ల రూపాయల రుణాలను కోల్డ్ స్టోరేజ్ యజమానులు తమ వ్యక్తిగత వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లిస్తున్నట్లు సమాచారం.
లబోదిబోమంటున్న బాధితులు: తమ ఆధార్ కార్డులు, డాక్యుమెంట్లు తీసుకుని తమకు కల్లబొల్లి మాటలు చెప్పి రుణాలు తీసుకున్నారని కొందరు అమాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ భారీ స్కామ్‌పై ఉన్నతాధికారులు దృష్టి సారించి, లోతైన విచారణ జరిపితే మరిన్ని నమ్మలేని నిజాలు బయటపడే అవకాశం ఉంది. బ్యాంకింగ్ నిబంధనలను తుంగలో తొక్కిన ప్రైవేట్ బ్యాంకు అధికారులు, మోసాలకు పాల్పడిన కోల్డ్ స్టోరేజ్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతులే కాదు కాని వారి పేర్లతో లోన్లు,ప్రైవేట్ బ్యాంకులను మోసం చేస్తున్న కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం,సహకరిస్తున్న బ్యాంకు సిబ్బంది. ఏ కోల్డ్ స్టోరేజ్, ఏ బ్యాంకు, నకిలీ రైతుల పేర్లతో బ్యాంకులకు కన్నం వేస్తున్న కోల్డ్ స్టోరేజ్ లపై వరుస కథనాలు.. “సర్కార్ లైవ్“ లో








