- టెక్స్‌టైల్ పార్క్ కేంద్రంగా కోట్ల దందా.. ప్రభుత్వ సర్వేయర్ ‘గాలి’ వేగం!
- సదా.. ఆనందంగా అక్రమాల పర్వం
- రియల్టర్ అవతారమెత్తిన ప్రభుత్వ సర్వేయర్
- ఏసీబీ నజర్ వేస్తే విస్తుపోయే అక్రమాస్తులు వెలుగులోకి
Warangal Textile Park Surveyor Scam | అతను ఒక ప్రభుత్వ సర్వేయర్. భూముల హద్దులు నిర్ణయించడమే అతని విధి. కానీ, ఆ హద్దులు దాటి అక్రమ సంపాదనలో ‘కోట్లకు పడగలెత్తాడు’. ప్రభుత్వ ఉద్యోగి ముసుగులో రియల్టర్ అవతారమెత్తి, సామాన్యుల భూములతో చెలగాటమాడుతూ అపర కుబేరుడిగా అవతరించాడు. వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఈ ‘రియల్’ సర్వేయర్ లీలలు హాట్ టాపిక్‌గా మారాయి.
టెక్స్‌టైల్ పార్క్.. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్!
మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటును ఆసరాగా చేసుకున్న ఈ సర్వేయర్, అక్కడ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని ‘గాలి’లా విస్తరించాడు. ప్రభుత్వ సమాచారం ముందే తెలుసుకుంటూ, అమాయక రైతులను బురిడీ కొట్టిస్తూ భూదందాలకు తెరలేపాడు. సర్వే నంబర్ల తారుమారు, హద్దుల మార్పు వంటి అస్త్రాలను వాడుతూ రియల్ రంగంలో పాతుకుపోయాడు.టెక్స్ట్ టైల్ పార్క్ చుట్టూ ఉన్న వెంచర్ లలో సగానికిపైగా వెంచర్ లలో ఇతగాడిదే ప్రధాన హస్తం.సాధారణ కుటుంబం నుండి వచ్చిన సదరు సర్వేయర్ ఇప్పుడు బినామీలను పెట్టుకొని వందల కోట్లు గడించినట్లు శాయంపేట హావేలి లో ప్రచారం జరగడం గమనార్హం.
సుబేదారిలో అడ్డా.. ముగ్గురు మిత్రుల ‘ముఠా’!
ఈ సర్వేయర్ తన కార్యకలాపాల కోసం సుబేదారి ప్రాంతంలో ఒక హైటెక్ ఆఫీసును నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరు భాగస్వాములతో కలిసి గుట్టుచప్పుడు కాకుండా వెంచర్లు వేయడం, ప్లాట్ల విక్రయాలు జరపడం ఇతని దైనందిన శైలి. విధుల్లో ఉండాల్సిన సమయంలో కూడా రియల్ ఎస్టేట్ బేరసారాలతోనే బిజీగా గడుపుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వ విధుల కంటే కూడా ఇతగాడి కి రియల్ ఎస్టేట్ పైనే మక్కువ ఎక్కువని తోటి ఉద్యోగులే చెప్తుండడం గమనించాల్సిన అంశం.
సదా.. ఆనందంగా.. అక్రమాల పర్వం!
చట్టం తనకేమీ చేయలేదనే ధీమాతో, ఎప్పుడూ ‘సదా.. ఆనందంగా’ కనిపిస్తూ తన రియల్ నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయో లేక వ్యవస్థలోని లోపాలను వాడుకుంటున్నాడో కానీ, సాధారణ ఉద్యోగి గా మొదలైన ఇతని ప్రస్థానం రియల్ ఎస్టేట్ తో ఆరు వెంచర్ లు 12 ప్లాట్లుగా వర్ధిల్లుతున్నట్లు మాతృశాఖలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల విలువ ఇప్పుడు వందల కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.
ఏసీబీ నజర్ వేస్తే.. అన్నీ బయటకే!
ఈ సర్వేయర్ అక్రమాస్తులపై ఏసీబీ (Anti-Corruption Bureau) దృష్టి సారించి విచారణ చేస్తే విస్తుపోయే నిజాలు బయటపడతాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. బినామీల పేరిట ఉన్న భూములు, విలాసవంతమైన భవనాలు,అక్రమాస్తుల గుట్టు రట్టు కావాలంటే సమగ్ర విచారణ అవసరమని ఈ అవినీతి తిమింగలాన్ని పట్టుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం జప్తుచేయాలని పలువురు కోరుతున్నారు.
కలెక్టర్ యాక్షన్ తీసుకోవాలి!
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, విధులను విస్మరించి రియల్ దందాలకు పాల్పడుతున్న ఈ ఉద్యోగి(సర్వేయర్ )పై వరంగల్ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. శాఖాపరమైన చర్యలతో పాటు, ఇతని అక్రమ ఆస్తులపై(ఉద్యోగంలో చేరే ముందు ఆస్తులు, ప్రస్తుతం ఉన్న ఆస్తులు) విచారణ జరిపించి ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సర్వేయర్ పై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కీ, ఏసీబీ డిజికి, వరంగల్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం…. మరో కథనంలో…








