Sarkar Live

రేపే కాళేశ్వరంలో ‘సరస్వతీ అంత్య పుష్కరాల’ ప్రారంభం – Saraswathi Antya Pushkaralu

Saraswathi Antya Pushkaralu Kaleshwaram 2026 | కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జరిగే అత్యంత ప్రతిష్టాత్మక ‘సరస్వతీ అంత్య పుష్కరాలకు’ సర్వం సిద్ధమైంది. మే 21వ తేదీ (గురువారం) నుంచి జూన్ 1 వరకు మొత్తం 12 రోజుల పాటు

Saraswathi Antya Pushkaralu Kaleshwaram 2026

Saraswathi Antya Pushkaralu Kaleshwaram 2026 | కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జరిగే అత్యంత ప్రతిష్టాత్మక ‘సరస్వతీ అంత్య పుష్కరాలకు’ సర్వం సిద్ధమైంది. మే 21వ తేదీ (గురువారం) నుంచి జూన్ 1 వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ముక్కోటి పుణ్యతీర్థానికి సుమారు 30 నుండి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రభుత్వం, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూ. 30.63 కోట్ల నిధులతో భారీ ఎత్తున పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

తొలి పుణ్యస్నానం ఎప్పుడంటే?

పుష్కరాల తొలిరోజైన 21వ తేదీ తెల్లవారుజామున 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాలు గోదావరి-సరస్వతీ నదిలో పుష్కర స్నానం ఆచరించి, ఈ అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. మే 21 నుంచి జూన్ 1 వరకు ప్రతి రోజూ దేశంలోని ఒక ప్రముఖ పీఠానికి చెందిన స్వామీజీలు ఈ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానాలు చేయనున్నారు.

వేసవి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక చర్యలు

గత సంవత్సరం జరిగిన ‘సరస్వతీ ఆది పుష్కరాల’ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తుల సౌకర్యార్థం:

  • పుష్కర ఘాట్ల వద్ద చలువ పందిళ్లు, కాయర్ మ్యాట్లు ఏర్పాటు చేశారు.
  • ఉచితంగా ఓ.ఆర్.ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.
  • ఘాట్లకు వెళ్లేందుకు వీలుగా 90 షటిల్ బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నారు.
  • తాగునీటి కోసం రెండు భారీ ఓహెచ్‌ఆర్‌సీ (OHRC) ట్యాంకులతో పాటు, ఘాట్ పరిసరాల్లో 500 టాయిలెట్లను నిర్మించారు.

భారీ పార్కింగ్.. 200 సీసీ కెమెరాల నిఘా

ఈ పుష్కరాలకు సుమారు 1.70 లక్షల వాహనాలు వస్తాయని అంచనా వేసి, అధికారులు 245 ఎకరాల విస్తీర్ణంలో 23 జోన్లుగా భారీ పార్కింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పార్కింగ్ ప్రాంతాల్లో కూడా తాగునీరు, టాయిలెట్ వసతులు కల్పించారు. భద్రత దృష్ట్యా ఘాట్లు, దేవాలయాలు, పార్కింగ్ ఏరియాల్లో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచారు.

300 మంది వైద్య సిబ్బంది.. 100 మంది గజ ఈతగాళ్లు

  • మెడికల్ క్యాంపులు: పుష్కర ప్రాంగణంలోని 23 జోన్లలో 300 మంది వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందితో కూడిన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం అంబులెన్సులను సిద్ధంగా ఉంచడంతో పాటు, మహాదేవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెఫరల్ ఆసుపత్రిగా మార్చారు.
  • గజ ఈతగాళ్లు: నదిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన 100 మంది గజ ఈతగాళ్లను నియమించారు. వీరితో పాటు సేఫ్టీ బోట్లు, లైఫ్ రింగులు, ఎస్.డి.ఆర్.ఎఫ్ (SDRF) బృందాలు నిరంతరం రంగంలో ఉంటాయి.

రూ. 1.20 కోట్లతో ప్రత్యేక మ్యూజియం

పుష్కరాలకు వచ్చే భక్తులను ఆకట్టుకునేలా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. 1.20 కోట్లతో ఒక ప్రత్యేక మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్థానిక నాగేంద్ర స్వామి ఆలయాన్ని రూ. 30 లక్షలతో పునర్నిర్మించారు. ఈ 12 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం హోమాలు, సాయంత్రం వేళల్లో నదీ హారతి, తెప్పోత్సవం మరియు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.

స్వచ్ఛత కోసం 300 మంది పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం పనిచేయనుండగా, సమాచార చేరవేత కోసం ప్రత్యేక మీడియా సెంటర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?