- ప్రకంపనలు సృష్టించిన “వామ్మో.. సర్వేయర్.. సరిహద్దులు దాటిన సంపాదన” కథనం
- సాధారణ సర్వేయర్ కు ఇన్ని ఆస్తులా అంటూ జోరుగా చర్చ
- అవినీతి నిరోధక శాఖ నజర్ వేస్తే సర్వేయర్ అవినీతి సామ్రాజ్యం కూలిపోవాల్సిందే…
Surveyor Corruption Allegations | “ఇప్పుడేంచేయాలి..?” అంటూ ఆ సర్వేయర్ ఇప్పుడు తలపట్టుకున్నారట.’సర్కార్ లైవ్’ వెబ్ సైట్ వెలువరించిన ఒకే ఒక్క కథనం ఇప్పుడు స్థానికంగా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది.ఒక సాధారణ సర్వేయర్ స్థాయికి మించి, ఊహకందని రీతిలో ఆస్తులు కూడబెట్టారనే అంశం పై “వామ్మో.. సర్వేయర్.. సరిహద్దులు దాటిన సంపాదన ” శీర్షికన సర్కార్ లైవ్ వార్త వెలువరించడంతో ఆ వార్త ఇప్పుడు ఎర్రబెల్లిగూడెంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణ సర్వేయర్.. అసాధారణ ఆస్తులు!
భూముల సరిహద్దులు కొలవాల్సిన సర్వేయర్.. తన సంపాదన సరిహద్దులను ఎప్పుడో దాటేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?” అంటూ ప్రజలతోపాటు నిజాయితీ అధికారుల్లో జోరుగా చర్చ సాగుతోంది. సర్వేల పేరుతో, భూ వివాదాలను ఆసరాగా చేసుకుని సదరు అధికారి భారీగా వెనకేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కూలిపోనున్న ‘అవినీతి సామ్రాజ్యం’?
నర్సింహులపేట మండలం లో విధులు నిర్వహించిన కాలంలో మొదలైన ఈ అవినీతి సామ్రాజ్యం పై ఏసీబీ గనుక రంగంలోకి దిగి లోతుగా విచారణ చేపడితే, ఈ సర్వేయర్ నిర్మించుకున్న అవినీతి సామ్రాజ్యం (Corruption Allegations ) కుప్పకూలడం ఖాయమని స్థానికులు చర్చించుకుంటున్నారు. నిఘా వర్గాలు సైతం సదరు అధికారి బినామీలు, ఆస్తుల వివరాలపై ఆరా తీసే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నట్లు సమాచారం.
హాట్ టాపిక్‌గా ‘సర్కార్ లైవ్’ కథనం:
‘సర్కార్ లైవ్’ వెబ్‌సైట్ బయటపెట్టిన సర్వేయర్ బండారం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. తోటి ఉద్యోగులు సైతం ఈ ఆస్తుల వివరాలు చూసి నోరెళ్లబెడుతున్నారు.హన్మకొండ జిల్లాలో ‘విజయ’వంతంగా విధులు నిర్వహిస్తున్న సదరు సర్వేయర్
వ్యవహారంపై ఉన్నతాధికారులు, అవినీతి నిరోధక శాఖ విచారణ చేపడుతారో లేదో చూడాలి మరి.








