- జీడబ్ల్యూఎంసీ నోటీసులు ‘కాగితాలకే’ పరిమితమా?
- 16వ డివిజన్‌లో ఆగని అక్రమ నిర్మాణాలు!
GWMC Illegal Constructions in Keerthi Nagar | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) 16వ డివిజన్ ప్రస్తుతం అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ, అధికారుల కళ్లు గప్పి కొందరు యథేచ్ఛగా కట్టడాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కట్టమల్లన్న ఆలయానికి సరిగ్గా ఎదురుగానే, మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున నిర్మాణాలు (Illegal Constructions) సాగుతుండటం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
నోటీసులకే పరిమితం.. చర్యలు ఎక్కడ?
ఈ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు నామమాత్రంగా స్పందించారు. సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ఆగకపోవడం అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. “నోటీసులు ఇచ్చి వదిలేస్తే సరిపోతుందా? అక్రమ కట్టడాలను కూల్చే ధైర్యం అధికారులకు లేదా?” అని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
నిబంధనల్లో పక్షపాతం: పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయమా?
టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. నిబంధనల అమలులో అధికారులు ‘డబుల్ స్టాండర్డ్స్’ పాటిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ అండదండలు, పలుకుబడి ఉన్నవారు,రియల్టర్ లు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నా అధికారులు అటువైపు చూడటం లేదని విమర్శలు ఉన్నాయి. అదే ఒక సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకోవాలని చూస్తే, నిబంధనల వంకతో పనులు ఆపేయడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నారని జనం మండిపడుతున్నారు.
Illegal Constructions : సిటీ ప్లానర్ స్పందిస్తారా?
పవిత్రమైన ఆలయ పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ దందాను అరికట్టాలని 16వ డివిజన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ సిటీ ప్లానర్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని, కేవలం నోటీసులకే పరిమితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజల ప్రశ్న..
అక్రమ నిర్మాణాలు బహిరంగంగా కనిపిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటే, ఈ నిర్మాణాలు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయా? లేక అక్రమార్కులు ప్రభుత్వ వ్యవస్థను బేఖాతర్ చేస్తున్నారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








