వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. చరిత్రలో నిలిచిపోయేలా తొలిసారిగా సుమారు రూ. 2 కోట్ల 50 లక్షల విలువైన హాష్ ఆయిల్‌ను (గంజాయి నూనె) స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. వరంగల్ డ్రగ్ కంట్రోల్ టీం, క్యాట్ పార్టీ మరియు ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన నిందితులు..
హంటల్ సన్ను (23) – మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా (ప్రధాన నిందితుడు)
హంటల్ సన్యాసి (23) – మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా
కండెల చిన్నబాబు (56) – అల్లూరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
కృష్ణ హంటల్ (56) – మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా
మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు
కేసు వివరాలు ఇలా ఉన్నాయి..
పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన స్వగ్రామంలో గంజాయి సాగు చేస్తూ విక్రయించేవాడు. అయితే గంజాయి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం విలాసాలకు సరిపోకపోవడంతో, హాష్ ఆయిల్ తయారు చేసే కిలో పాండుతో చేతులు కలిపాడు. పాండు సూచనల మేరకు ప్రత్యేక పరికరాలను ఉపయోగించి గంజాయి మొక్కల నుండి సుమారు 40 కిలోల హాష్ ఆయిల్‌ను సేకరించారు.
దీనిని చెరో సగం పంచుకోగా, పట్టుబడిన నలుగురు నిందితులు తమ వాటాకు వచ్చిన 20 కిలోల హాష్ ఆయిల్‌ను ముంబైలో విక్రయించాలని ప్లాన్ చేశారు. కిలో చొప్పున ప్యాకెట్లు చేసి, ఈ నెల 19న తుని రైల్వే స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు.
వరంగల్ బస్టాండ్ వద్ద పట్టుబడ్డారు:
రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయని భావించిన నిందితులు, అనుమానం రాకుండా వరంగల్ స్టేషన్‌లో దిగిపోయారు. మంగళవారం ఉదయం ముంబై వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ సమీపంలోని రైల్వే గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా వారి వద్ద 20 కిలోల హాష్ ఆయిల్, రెండు సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి.
పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకుని చాకచక్యంగా వ్యవహరించిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏఎస్పీ శుభం, ఏసీపీలు జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ వై. సతీష్, ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ షుకూర్ మరియు వారి బృందాన్ని సీపీ సన్‌ప్రతీ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.








