Sarkar Live Exclusive | గత కొన్నిరోజుల క్రితం సీఎంఆర్ (CMR – కస్టమ్ మిల్లింగ్ రైస్ ) గడువు ముగిసింది. కానీ ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించి గడువును పెంచింది. అయినప్పటికీ కొంతమంది మిల్లర్ లు మాత్రం ప్రభుత్వానికి పెట్టాల్సిన సీఎంఆర్ ను మాత్రం పూర్తిచేయలేకపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది మిల్లర్ లు ఇప్పటికే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించడంవల్లే సీఎంఆర్ పూర్తిచేయలేకపోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా బొల్లికుంట రెవెన్యూ శివారులోని సాయిరాం రైస్ మిల్లు సీఎంఆర్ (Sairam Rice Mill CMR) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.2025-26ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ మిల్లర్ ప్రభుత్వానికి 47 ఏసికేల సీఎంఆర్ పెట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 23 ఏసికేల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇంకా 24 ఏసికేల సీఎంఆర్ పెట్టాల్సి ఉండగా,అసలు 24 ఏసికే లకు సరిపడా ధాన్యం మిల్లులో ఉందా?అనేది ప్రశ్నగా మారింది.
’సాయిరాం’ లో ధాన్యం భద్రమేనా?
వరంగల్ జిల్లా బొల్లికుంట రెవెన్యూ శివారులోని సాయిరాం రైస్ మిల్లు యాజమాన్యం 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పౌరసరఫరాల శాఖ కు 24 ఏసికెల బియ్యం పెట్టాల్సి ఉంది. అయితే 24 ఏసికే లకు సంబంధించిన ధాన్యం ఈ మిల్లులో భద్రంగా ఉందా?లేదా అనేది అనుమానంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ మిల్లు తాత్కాలికంగా బంద్ ఉండటం చూస్తుంటే సదరు మిల్లులో ఉండాల్సిన ధాన్యం పై అనుమానాలు రెట్టింపవుతున్నాయి.సాధారణంగా మిల్లుల్లో ధాన్యం నిల్వలను పౌరసరఫరాల శాఖ డిటీలు ఎప్పటికప్పుడు భౌతికంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. మరి ఈ మిల్లులోని ధాన్యాన్ని అధికారులు తనిఖీ చేసారా? లేదా ? అనేది వారికే తెలియాలి.అసలు విషయం ఏమిటంటే రికార్డుల్లో కనిపిస్తున్న ధాన్యానికి, మిల్లులో ఉన్న ధాన్యానికి పొంతన లేదని ప్రచారం జరగడం గమనార్హం.ప్రచారం జరుగుతున్నట్లు ధాన్యం నిల్వల గల్లంతు ఆరోపణలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సి ఉంది. ‘సాయిరాం’ పెండింగ్ నిల్వలపై సమగ్ర విచారణ జరిపి, ధాన్యం మాయమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








