- అందినకాడికి దండుకున్న ‘ఆ’ అధికారి
- గత ప్రభుత్వంలో పోస్టింగ్‌లు, బదిలీలతో భారీగానే వెనకేసినట్లు ఆరోపణలు ?
- తోటి అధికారులతో పాటు వాహనదారులకూ వాత..
- ‘ఆ ఒక్క వికెట్ పడితే ఖేల్ ఖతం’… రవాణా శాఖలో జోరుగా సెటైర్లు!
RTO Corruption | “వామ్మో… రామచంద్రా… ఆ రవాణా శాఖ అధికారి లీలలు మామూలుగా ఉండేవి కావాయ్యో !” అంటూ ఇప్పుడు సదరు శాఖలో ఉద్యోగులు, అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి గారి అవినీతి పురాణం ఇప్పుడు రవాణా శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. పోస్టింగ్‌ల దగ్గర నుంచి బదిలీల వరకు.. ప్రతి ఫైలుకూ ఓ రేటు కట్టి గట్టిగానే దండుకున్నట్లు శాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది.
RTO Corruption : జోన్‌ను గుప్పిట్లో పెట్టుకుని…
సదరు అధికారి గత ప్రభుత్వంలో ఓ కీలకమైన జోన్‌ను తన గుప్పిట్లో పెట్టుకొని, సమాంతర సామ్రాజ్యాన్ని నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, అందినకాడికి దోచుకోవడమే పరమావధిగా సాగిన ఈ లీలలపై రవాణా శాఖ లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.తోటి అధికారుల సొమ్మును సైతం వదలకుండా, అటు వాహనదారుల జేబులకు కూడా గట్టిగానే కత్తెర వేసినట్లు తెలుస్తోంది. సదరు సారు గారి ‘వసూళ్ల పర్వం’ భరించలేక, అప్పట్లో కొంతమంది మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (MVI), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (AMVI) లోలోపలే మదనపడి ఇప్పుడు బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు.
ఆ ఒక్క వికెట్ పడితే ‘ఖేల్ ఖతం’!
గత ప్రభుత్వంలో రవాణా శాఖ లోని ఓ ఇద్దరు కీలక అధికారుల అండ చూసుకుని రవాణా శాఖలో(ఓ జోన్లో )చక్రం తిప్పిన ప్రస్తుత ఆర్టీవో (RTO ) తన డిపార్ట్మెంట్ లోని ఇద్దరు గాడ్ ఫాదర్ లు (కీలక అధికారులు )పదవీ విరమణ పొందడంతోపాటు ,కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో డైలామాలో పడ్డట్లు సమాచారం. గత ప్రభుత్వంలో గట్టిగా వెనకేసుకోవడంతోపాటు రవాణా శాఖను ఒక ఊపు ఊపిన బ్యాచ్ లో ఇప్పటికే కొంతమంది అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం, మరికొంతమంది రిటైర్ కావడంతో ఈ ఒక్క పెద్ద తలకాయనే మిగిలి ఉందని,”ఈ ఒక్క వికెట్ గనుక పడితే… రవాణా శాఖలోని అక్రమార్కుల బ్యాచ్ ఖేల్ ఖతం” అని శాఖలోని కొందరు అధికారులు సెటైర్లు వేసుకోవడం గమనార్హం.
ఇప్పటికే సదరు అధికారిపై ప్రభుత్వం నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. మరి ఈ రవాణా ‘లీలాధరుడి’పై కొత్త ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో, అవినీతి తిమింగలాన్ని ఎప్పుడు బోనులో నిలబెడుతుందో వేచి చూడాలి!








