- వచ్చిన కాలం నాలుగు రోజులే.. ఉన్నప్పుడే వెనకేసుకోవాలన్నదే లక్ష్యం!
- నిబంధనలు గాలికి.. చెరువు శిఖం భూములకు కూడా రిజిస్ట్రేషన్లు!
- కాసులు కురిపిస్తున్న ‘నాన్ లేఅవుట్’ వెంచర్లు.. చర్చనీయాంశంగా మారిన అధికారి తీరు.
Illegal Registrations in warangal | ఆ కుర్చీకి ఉన్న పవర్ అటువంటిదో.. లేక ఆ అధికారికి ఉన్న ‘అండదండలు’ అటువంటివో తెలియదు కానీ, అక్కడ నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి. నిలువునా అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ సదరు ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ సాగించిన ‘రిజిస్ట్రేషన్ల పర్వం’ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అంతా ‘ఇంచార్జి’ మాయ!
శాశ్వత ప్రాతిపదికన పనిచేసే సబ్ రిజిస్ట్రార్ల కంటే, ఇంచార్జిలుగా బాధ్యతలు చేపట్టిన వారే ఎక్కువ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “వచ్చిన కాలం నాలుగు రోజులు.. ఉన్నప్పుడే గట్టిగా వెనకేసుకోవాలి” అన్న చందంగా సదరు అధికారి తీరు ఉందని క్షేత్రస్థాయిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తక్కువ కాలంలోనే ఎక్కువ సంపాదించాలనే ధ్యేయంతో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది.
Illegal Registrations : నిబంధనలు తుంగలో.. అక్రమాల పర్వం!
స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించాల్సిన చోట, ఈ అధికారి కాసుల కోసం ఎర్ర తివాచీ పరుస్తున్నారు. ఇటీవలి కాలంలో సదరు సబ్ రిజిస్ట్రార్ సాగించిన కొన్ని వ్యవహారాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
శిఖం భూములకు సైతం రిజిస్ట్రేషన్: అత్యంత వివాదాస్పదమైన, ఎఫ్.టి.ఎల్ పరిధిలోకి వచ్చే చెరువు శిఖం భూములను సైతం రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం.
నాన్ లేఅవుట్ దందా: ఎలాంటి డీటీసీపీ లేదా హెచ్ఎండీఏ అనుమతులు లేని నాన్ లేఅవుట్ వెంచర్లలోని భూమిని కూడా పార్టులుగా రిజిస్ట్రేషన్ చేస్తూ సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారు.
మామూళ్ల మత్తు: ప్రతి డాక్యుమెంట్‌కు ఒక రేటు ఫిక్స్ చేసి, ‘లాల్ సాబ్’ మార్క్ వసూళ్లకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
“ఏ స్థాయిలో మామూళ్ల వ్యవహారం నడిస్తే ఇంత సాహసోపేతంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తారు?” – ఇదే ఇప్పుడు సామాన్యుడి మదిలో మెదులుతున్న ప్రశ్న.
మరిన్ని విస్తుగొలిపే నిజాలు, ఆధారాలతో కూడిన సంచలన కథనం మీ “సర్కార్ లైవ్” లో త్వరలో…








