KTR Rythu Sangrama Sadassu Warangal | అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ మే 6, బుధవారం వరంగల్ నగరాన్ని వేదికగా చేసుకుని ‘రైతు సంగ్రామ సదస్సు’ (Rythu Sangrama Sadassu)ను నిర్వహించింది. గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలోని 4 ఎకరాల విశాలమైన మైదానంలో జరిగిన ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సీఎం కాదని, ఆయన ఒక ‘ఎగవేతల రేవంత్ రెడ్డి’ అని ఎద్దేవా చేశారు.
ఒట్టు పెట్టి మోసం చేశారు..
భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్ వచ్చి రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టుకున్న రేవంత్ రెడ్డి, నేడు ఆ మాట తప్పి రైతులను వంచించారని కేటీఆర్ మండిపడ్డారు. “దమ్ముంటే రేవంత్ రెడ్డి ఏదైనా ఒక గ్రామానికి రావాలి.. ఆ ఊరిలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే, నేను నా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తాను” అని కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ అనేది ‘చారానా.. టోపీ బారానా’ అన్న చందంగా మారిందని ఎద్దేవా చేశారు.
ఢిల్లీకి కప్పం.. రాష్ట్రంలో దందాలు!
రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, కేవలం ‘రెన్యువల్ సీఎం’ అని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి 69 సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి 69 పైసలు కూడా తీసుకురాలేదని, కానీ తెలంగాణ సంపదను మాత్రం మూటలు కట్టి రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతుబంధు కాదని, ‘రాహుల్ బంధు’ నడుస్తోందని, ప్రజల గురించి పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో స్వర్ణయుగం..
తెలంగాణ ఆగమైపోయిన తరుణంలో పదేళ్ల పాటు కేసీఆర్ రైతును రాజుగా మార్చారని కేటీఆర్ గుర్తుచేశారు. పదేళ్లలో రైతు సంక్షేమం కోసం రూ. 5 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. బిఆర్ఎస్ హయాంలో సాగు పెరిగి భూముల ధరలు పెరిగితే, కాంగ్రెస్ రాకతో మళ్లీ వెనుకటి కరువు రోజులు వస్తున్నాయని, భూముల రేట్లు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు పడిగాపులు కాస్తున్నారని, లక్సెట్టిపేటలో గోడ కూలి నలుగురు రైతులు చనిపోవడం కాంగ్రెస్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
రైతు పక్షాన నాలుగు కీలక తీర్మానాలు:
సదస్సు వేదికగా రైతులకు ధైర్యం చెప్పిన కేటీఆర్, ప్రభుత్వం ముందు నాలుగు ప్రధాన డిమాండ్లను ఉంచారు:
- పరిహారం: కాంగ్రెస్ పాలనలో మరణించిన వెయ్యి మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలి.
- డిక్లరేషన్ అమలు: వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన 34 హామీలను తక్షణం నెరవేర్చాలి.
- బోనస్: అన్ని పంటలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా రూ. 500 బోనస్ చెల్లించి కొనుగోలు చేయాలి.
- రుణమాఫీ & బీమా: రూ. 2 లక్షల రుణమాఫీ పెండింగ్‌లో ఉన్న వారందరికీ పూర్తి చేయాలి. రైతుబంధును సక్రమంగా వేస్తూ, రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలి.
రైతులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, రెండేళ్లలో మళ్లీ ‘రైతుబంధు కేసీఆర్’ రాజ్యం వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ తీర్మానాలను వెంటనే ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.








