ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పక్షమైన కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై నిప్పులు చెరిగారు.
‘తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే..’ – మంత్రి పొన్నం ప్రభాకర్
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు.
”తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే.. ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరు. ఇక్కడి మట్టితో మాకు పేగు బంధం ఉంది” అని ఆయన స్పష్టం చేశారు.
తన వ్యాఖ్యల ద్వారా పవన్ కల్యాణ్ తనకు ఆంధ్రప్రదేశ్‌లోనే దిక్కు లేదనే విషయాన్ని స్వయంగా అంగీకరించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమానికి పవన్ ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ఏనాడైనా అండగా నిలిచారా? అని పొన్నం నిలదీశారు. తెలంగాణపై పవన్‌కు ఎందుకంత కడుపుమంట అని ఆయన ప్రశ్నించారు.
సినిమాలు ఫ్లాప్ అయిన డిప్రెషన్‌లో పవన్: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ రాజకీయాలు ప్యాకేజీల చుట్టూ తిరుగుతాయని ఆరోపించారు. ఇటీవల వచ్చిన ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్‌సిНГ’ సినిమాలు ఫ్లాప్ కావడంతో, ఆ డిప్రెషన్ తట్టుకోలేకే పవన్ కల్యాణ్ ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
అనిరుధ్ రెడ్డి సంధించిన మరికొన్ని ప్రశ్నలు:
•కేంద్ర మంత్రి అమిత్ షాపై అంత ప్రేముంటే పవన్ కల్యాణ్ గుజరాత్‌కు వెళ్లి పోటీ చేయాలని సవాల్ విసిరారు
•ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ఎన్ని రోజులు, ఏపీలో ఎన్ని రోజులు ఉంటున్నారో చెప్పాలన్నారు.
• ప్రధాని మోదీ వస్తే నిన్ను అమరావతిలో కలిశారా? లేక హైదరాబాద్‌లో కలిశారా? అని ప్రశ్నిస్తూ, తిరుపతి హుండీలో వేసిన డబ్బుల గురించి కూడా గొప్పలు చెప్పుకునే స్థాయికి పవన్ దిగజారారని విమర్శించారు.
”తెలంగాణ మీ అయ్య జాగీరా?” – పవన్ కల్యాణ్ ఫైర్!
ఇంతకుముందు హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావంటూ తనపై బెదిరింపులకు దిగుతున్న కాంగ్రెస్ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? ‘బాంచన్’ అనేవాళ్లమైతే పార్టీలు పెట్టేవాళ్లం కాదు” అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.
పవన్ కల్యాణ్ లేవనెత్తిన ప్రధానాంశాలు..
గతంలో మహబూబ్‌నగర్, ఖమ్మంలో దాడులు జరిగినా భరించానని, తనపై తొలి కేసు నమోదైంది కూడా తెలంగాణలోనేనని పవన్ గుర్తుచేశారు. ‘నాలుకలు కోస్తాం’ అనే కాంగ్రెస్ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
కొండగట్టు అంజన్న ఆలయానికి రూ. 30 కోట్లు, వరద సహాయంగా రూ. కోటి ఇచ్చానని, తెలంగాణకు అన్యాయం జరిగితే మొదట గళం విప్పేది జనసేన పార్టీయేనని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు ఇష్టమేనని చెబుతూనే.. తాను చెరువు భూములు కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఆ భూమిని రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు.
ప్రజలను రెచ్చగొట్టడం ఇష్టం లేదు
గత కేసీఆర్ ప్రభుత్వంలో తాను ఎన్నడూ ఎవరినీ ఒక్క మాట అనలేదని, ఇక్కడి నిరుద్యోగానికి తాను కారణం కాదన్నారు. ఆంధ్రా వాళ్లను పదే పదే తిడుతుంటే చిత్రపరిశ్రమ ఇక్కడ ఎలా ప్రశాంతంగా ఉండగలదని ప్రశ్నించారు.
తెలంగాణ సమాజం, నేతలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, దానికి కాంగ్రెస్ నేతలు ఇస్తున్న కౌంటర్లతో రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ పొలిటికల్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.








