Private School Fee | మరికొన్ని రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం (2026-27) ప్రారంభం కానుండటంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు మళ్లీ ఫీజుల వేట మొదలుపెట్టాయి. బడులు ఇంకా తెరుచుకోకముందే అడ్మిషన్లు, పుస్తకాలు, యూనిఫామ్‌ల పేరిట సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులకు భారీ చిల్లు పెడుతున్నాయి. ప్రభుత్వ జీవోలు, కోర్టుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రైవేట్ స్కూళ్ల ‘ఫీజు’ రాజ్యం నిరంకుశంగా సాగుతోంది.
Private School Fee : 20% నుండి 30% పెరిగిన ఫీజులు.. నో డొనేషన్, నో సీట్!
- గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫీజులను ఏకంగా 20% నుండి 30% వరకు పెంచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
- ప్రాథమిక తరగతులకే రూ. 50 వేల నుండి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తుండటం గమనార్హం.
- హైస్కూల్ విద్యార్థులకు అయితే టెక్నో, ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ స్కూలు స్థాయిని బట్టి రూ. 1.5 లక్షల నుండి రూ. 3 lakhs వరకు డిమాండ్ చేస్తున్నారు.
- పైగా సీటు కావాలంటే ముందే ‘బిల్లు లేని’ డొనేషన్లు కట్టాలంటూ యాజమాన్యాలు కండిషన్లు పెడుతున్నట్లు సమాచారం
పాఠశాలలా? ‘కమర్షియల్ మాల్స్’?
చదువు చెప్పాల్సిన పాఠశాలలు ఇప్పుడు పక్కా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. కేవలం ట్యూషన్ ఫీజుతోనే ఈ దోపిడీ ఆగడం లేదు. పుస్తకాలు స్కూల్ యూనిఫార్మ్స్ పాఠశాల ఆవరణలోనే లేదా వారు చెప్పిన నిర్దిష్ట దుకాణాల్లోనే పుస్తకాలు, నోట్‌బుక్స్, బెల్టులు, షూస్ కొనాలనే నిబంధన విధిస్తున్నారు. బయట మార్కెట్‌లో రూ. 2,000 పలికే పుస్తకాల సెట్‌ను, స్కూళ్లలో రూ. 6,000 నుండి రూ. 8,000 వరకు విక్రయిస్తూ భారీగా కమీషన్లు వెనకేసుకుంటున్నారు.అంతేకాకుండా కేవలం 2-3 కిలోమీటర్ల స్వల్ప దూరానికి కూడా ఏడాదికి రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు వ్యాన్, బస్సు ఫీజుల రూపంలో గుంజుతున్నారు. డిజిటల్ క్లాసులు, స్మార్ట్ బోర్డులు, స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ అంటూ నెలనెలా ఏదో ఒక సాకుతో అదనపు బాదుడు తప్పడం లేదు.
నిమ్మకు నీరెత్తినట్లు విద్యాశాఖ!
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం గతంలో ప్రభుత్వం కమిటీలు వేసినా, నిబంధనలు తెచ్చినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రతి స్కూల్ తమ ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలనే నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రైవేట్ యాజమాన్యాలు మరింత రెచ్చిపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జూన్ మొదటి వారంలో బడులు ప్రారంభం కానుండటంతో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాలని, ఫీజుల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు
ప్రశ్నార్థకంగా మారిన జీవో 46!
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించేందుకు, పారదర్శకత పెంచేందుకు గతంలో తీసుకొచ్చిన జీవోలు క్షేత్రస్థాయిలో అటకెక్కాయి. ఏటా ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచకూడదనే నిబంధనను ఏ ఒక్క కార్పొరేట్ సంస్థా పాటించడం లేదు. అధికారులు కేవలం నామమాత్రపు నోటీసులతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
తల్లిదండ్రుల ఆవేదన..
“పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసైనా పెద్ద స్కూళ్లలో చేర్పిస్తున్నాం. కానీ ఏటా బుక్స్, డ్రెస్సులు, బిల్డింగ్ ఫీజులంటూ వేలల్లో పెంచుకుంటూ పోతే మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎలా బతకాలి? ప్రభుత్వం ఫీజులపై ఖచ్చితమైన పరిమితి విధించాలి.”
— ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థి తండ్రి, హన్మకొండ .








