- గత ప్రభుత్వంలో కోట్లు కొల్లగొట్టిన సీనియర్ ఎంవీఐ
- మూడేళ్ళ క్రితం వరకు ట్రాన్స్ఫర్స్.. ఓడీలు.. అన్నీ ‘D’ అడ్రస్సే!
రవాణా శాఖలో అతనో సామాన్య మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్.కానీ, అతని పరపతి చూస్తే పెద్ద పెద్ద అధికారులే నోరెళ్లబెట్టాలి. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పి, యూనియన్ ముసుగులో అడ్డగోలు దోపిడీకి తెరలేపిన ఒక సీనియర్ ఎంవీఐ (MVI) నిర్వాకం ఇప్పుడు రవాణా శాఖలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఆర్టీఓ (RTO)గా ప్రమోషన్ పొందేందుకు పావులు కదుపుతున్న ఈ ‘మహానుభావుడి’ అవినీతి చిట్టా ఇప్పుడు బయటపడుతోంది.
ఆ ఇద్దరు డీటీసీల పేర్లతో హల్చల్!
గత ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలోని ఇద్దరు కీలక డీటీసీల (DTC) పేర్లను వాడుకుంటూ ఈ ఎంవీఐ ఆడిన ఆటలు అన్నీ ఇన్నీ కావట,వారిద్దరికీ తాను అత్యంత సన్నిహితుడినని చెప్పుకుంటూ, శాఖలోని కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరినీ భయపెట్టి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ ముసుగులో మేనేజ్మెంట్ కోటాను శాసించే స్థాయికి ఎదిగిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫర్స్.. ఓడీలు.. అన్నీ ‘D’ అడ్రస్సే!
దాదాపు మూడేళ్ల క్రితం వరకు రవాణా శాఖ లోని ఒక ప్రత్యేక జోన్కు ఈ అధికారి అనధికార ప్రతినిధిగా వ్యవహరించారు.
బదిలీలు (Transfers): తనకు నచ్చిన చోటుకు పోస్టింగ్ ఇప్పించడం.
ఓడీలు (Other Duty): కావాల్సిన వారికి అనుకూలమైన డ్యూటీలు వేయించడం.
మామూళ్లు: ప్రతినెలా వసూలు చేసే మామూళ్లలో సింహభాగం ఈయన కనుసన్నల్లోనే జరిగేదని సమాచారం. “D” అనే అక్షరంతో మొదలయ్యే ఇంటి పేరున్న ఈ అధికారి, అప్పట్లో ఒక జోన్ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఏకఛత్రాధిపత్యం చలాయించారని తోటి ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.
ఏసీబీకి పట్టుబడ్డ అధికారి పేరుతో వసూళ్లు?
రవాణా శాఖ లో నెంబర్ టూ గా పేరు సంపాదించుకుని గత ఏడాది ఏసీబీ (ACB Target)కి చిక్కిన ఒక డీటీసీ ని కూడా ఈయన తన స్వార్థానికి వాడుకున్నట్లు తెలుస్తోంది. సదరు డీటీసీ ని అన్నా అని సంబోదిస్తూ ఆయన పేరు చెప్పి రవాణాశాఖ లోని అనేకమంది ఎంవీఐ లు, ఏఎంవీఐ ల వద్ద నుండి గట్టిగానే వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. 3 ఏండ్ల క్రితం వరకు రవాణా శాఖ లోని ఓ జోన్ ను శాసించాడంటే ఇతడికి ఆ యూనియన్ లోని ఇద్దరు కీలక నేతలు ఏవిధమైన ఫ్రీహ్యాండ్ ఇచ్చారో అర్ధంచేసుకోవచ్చు. ఇదే ఫ్రీహ్యాండ్ ను ఆసరాగా చేసుకున్న సీనియర్ ఎంవీఐ వారిద్దరికి తెలియకుండా అదనంగా(అక్రమంగా) వసూళ్లు చేసేవాడని సమాచారం.
బినామీల పేర్లతో ఆస్తుల కుప్పలు!
ఈ ఎంవీఐ సంపాదించిన కోట్లాది రూపాయలు ఎక్కడ ఉన్నాయనే దానిపై రవాణా శాఖలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన పేరు మీద కాకుండా, బినామీల పేర్లతో భారీగా స్థిరాస్తులు, ఫామ్ హౌస్లు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఏసీబీ అధికారులు లోతుగా నిఘా పెడితే, అక్రమ ఆస్తుల తిమింగలం బయటపడటం ఖాయమని స్పష్టమవుతోంది. గత ఏడాది ఏసీబీకి పట్టుబడ్డ డిటిసి పేరు, ఈ ఎంవీఐ పేరు ఒక్కటే కావడం విశేషం.
ప్రమోషన్ వస్తుందా? ఏసీబీ వేటు పడుతుందా?
ప్రస్తుతం ఆర్టీఓగా పదోన్నతి పొందనున్న ఈ సీనియర్ ఎంవీఐ పై రవాణా శాఖ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన అనేక మంది అధికారులపై ఏసీబీ వరుస దాడులు నిర్వహించింది.రవాణా శాఖ లో ఇప్పటికే ఏసీబీ కి పట్టుబడ్డ అధికారుల కంటే కూడా బినామీ పేర్లతో ఈయన కూడబెట్టిన ఆస్తులు ఎక్కువేనని మాతృశాఖలోని అధికారులు మాట్లాడుకోవడం కొసమెరుపు. అయితే, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు, బినామీ ఆస్తుల వ్యవహారంపై ప్రభుత్వం దగ్గర ఇప్పటికే నివేదికలు ఉన్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీఏ ను ఒక ఊపు ఊపిన(అక్రమంగా సంపాదించిన) అధికారులందరిపై ఏసీబీ రైడ్ చేసింది.ప్రస్తుతం ఈ లిస్ట్ లో ఈ సీనియర్ ఎంవీఐ తోపాటు మరో ఆర్టీఓ నే మిగిలి ఉండటంతో నెక్స్ట్అవినీతి నిరోధక శాఖ టార్గెట్ వీరిద్దరనే ప్రచారం రవాణా శాఖ లో జరగడం గమనార్హం.ప్రచారం జరుగుతున్నట్లు ఈయనపై ఏసీబీ రైడ్ చేస్తుందా?ఆర్టీఓ గా ప్రమోషన్ పొంది తన హవాను ఈ ప్రభుత్వం లో కూడా కొనసాగిస్తారా చూడాలి మరి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








