Maruti Rice Mill Scam | వరంగల్ జిల్లాలోని మాల్యా తండాలో ఉన్న మారుతీ రైస్ మిల్లులో నిల్వ ఉండాల్సిన ప్రభుత్వ ధాన్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సుమారు రూ. 3 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మిల్లులో భద్రంగా ఉన్నాయా? లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సగానికి పైగా గల్లంతు?
2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మారుతీ రైస్ మిల్లు యాజమాన్యం సుమారు 30 ఏసికే ల సీఎంఆర్ ప్రభుత్వానికి పెట్టాల్సి ఉంది. కానీ సదరు మిల్లులో 30 ఏసికెలకు సరిపడా ధాన్యం నిల్వలు లేవని, సగానికి పైగా నిల్వలు గల్లంతయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.3 కోట్ల ధాన్యంలో 1 కోటికి పైగా విలువ చేసే ధాన్యం మాయమైనట్లు మిల్లులోని ధాన్యం నిల్వలను చూస్తేనే అర్ధం అవుతుంది.

Rice Mill Scam | మిల్లులో తనిఖీలకు డిమాండ్
మారుతీ రైస్ మిల్లులో ప్రస్తుతం ఉన్న నిల్వలపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పద్ధతి ప్రకారం జరగాల్సిన ఫిజికల్ వెరిఫికేషన్ (భౌతిక తనిఖీ) నిర్వహిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వ సంపద దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, తక్షణమే మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై సివిల్ సప్లై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.








