- మహాలక్ష్మి, విజయలక్ష్మి మిల్లుల్లో రూ. 2 కోట్ల విలువైన ధాన్యం మాయం!
- 10 ఏసికేల ధాన్యాన్ని మింగేసిన విజయలక్ష్మి మిల్లర్
- ఫిజికల్ వెరిఫికేషన్ జరిగితే గుట్టు రట్టు?
Parvathagiri CMR Scam | రైతు కష్టార్జితమైన ధాన్యాన్ని మరాడించి సీఎంఆర్ గా మార్చాల్సిన రైస్ మిల్లులు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొన్ని రైస్ మిల్లుల్లో 2025-26ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సివిల్ సప్లై అధికారులు అప్పగించిన ధాన్యం నిల్వల్లో భారీ తేడాలు కనిపిస్తుండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ముఖ్యంగా మాల్యా తండా లోని “మహాలక్ష్మి”, ఏనుగల్లు రెవెన్యూ పరిధిలోని”విజయలక్ష్మి” రైస్ మిల్లుల చుట్టూ ఇప్పుడు అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మహాలక్ష్మిలో కోటి రూపాయల గోల్ మాల్?
మాల్యా తండా లోని మహాలక్ష్మి రైస్ మిల్లులో నిల్వ ఉండాల్సిన ధాన్యంలో సుమారు కోటి రూపాయలకు పైగా విలువ చేసే స్టాక్ మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. రికార్డుల్లో సుమారు 20 ఏసికేల ధాన్యం ఉన్నట్లు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం బస్తాలు కనిపించడం లేదు. అధికారుల కళ్లు గప్పి ఈ ధాన్యాన్ని పక్కదారి పట్టించారా? లేక గుట్టుచప్పుడు కాకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజయలక్ష్మి లో 10 ఏసికేల ధాన్యం ‘స్వాహా’..
మరోవైపు విజయలక్ష్మి రైస్ మిల్లు అక్రమాల్లో మరో అడుగు ముందుకు వేసింది. ఈ మిల్లర్ ప్రభుత్వానికి సుమారు 18 ఏసికెల బియ్యం అప్పగించాల్సి ఉండగా దానిలో నుండి సుమారు 10 ఏసికేల (ACKs) కు సంబంధించిన ధాన్యాన్ని మిల్లర్ నిలువునా మింగేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లుకు వచ్చిన ప్రతి గింజకు లెక్క ఉండాలి. కానీ, ఇక్కడ లెక్కలు అడిగే వారు లేకపోవడంతో మిల్లర్లు ఆడిందే ఆటగా సాగుతోంది. ఈ ధాన్యం విలువ కూడా రూ. కోటి వరకు ఉంటుందని అంచనా.
ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తేనే అసలు రంగు బయటపడేది!
ఈ రెండు మిల్లుల్లో జరుగుతున్న మాయాజాలం వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సదరు మిల్లుల్లో ‘ఫిజికల్ వెరిఫికేషన్’ (భౌతిక తనిఖీ) నిర్వహిస్తే, నిల్వల్లో ఉన్న భారీ తేడాలు బయటపడే అవకాశం ఉంది. కేవలం రికార్డులను చూసి వెనుదిరగకుండా, ప్రతి బస్తాను లెక్కపెడితే మిల్లర్ల అసలు గుట్టు రట్టవుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సివిల్ సప్లై అధికారులు మరియు జిల్లా యంత్రాంగం ఈ భారీ కుంభకోణంపై దృష్టి సారిస్తారా? లేక మిల్లర్ల మాయాజాలానికి వందనం కొడుతారా? అన్నది వేచి చూడాలి.








